పెద్దమనుషుల ఒప్పందం
* ఈ ఒప్పందం ఢిల్లీలోని హైద్రాబాద్ హౌజ్ (ప్రస్తుత ఆంధ్రభవన్) 1956 ఫిబ్రవరి 20 న జరిగింది.
ఈ ఒప్పందంనే పెద్దమనుషుల ఒప్పందం (లేదా) జెంటిల్మెన్ అగ్రిమెంట్ అందురు.
> ఈ ఒప్పందంపై ఆంధ్రానుండి – నలుగురు నాయకులు తెలంగాణా నుండి 4గురు నాయకులు సంతకం చేశారు.
ఒప్పందంలో తెలంగాణ నాయకులు:
1) బూర్గుల రామకృష్ణారావు (హైద్రాబాద్ సి.ఎమ్.)
2) కె.వి. రంగారెడ్డి
3) మర్రి చెన్నారెడ్డి
4) జె. వి. నర్సింగరావు
ఆంధ్ర నాయకులు:
1) బెజవాడ గోపాల్ రెడ్డి – (ఆంధ్ర సి.ఎమ్.)
2) నీలం సంజీవరెడ్డి
3) సర్దార్ గౌతు లచ్ఛన్న
4) అల్లూరి సత్యనారాయణ రాజు
పెద్ద మనుషుల ఒప్పందంలోని అంశాలు:
1. రాష్ట్రం కేంద్రీకృత, సాధారణ పాలనా ఖర్చు తెలంగాణ ఆంధ్ర ప్రాంతాలు దామాషా ప్రకారు భరించాలి.
తెలంగాణ ప్రాంతపు మిగులు ఆదాయాలు తెలంగాణ అభివృద్ధి కోసం రిజర్వ్ చేసి ఉంచాలి.
ఈ ఏర్పాటును ఐదు సంవత్సరాల అనంతరం ఒకవేళ తెలంగాణ ప్రాంత శాసన సభ్యుల కోరితే సమీక్షించాలి.
2. తెలంగాణ ప్రాంత శాసన సభ్యులు సూచించిన పద్ధతులనే తెలంగాణలో మధ్య నిషేదం అమలుకావాలి
3. తెలంగాణాలో ప్రస్తుతం ఉన్న విద్యాసౌకర్యాల్లో తెలంగాణ విద్యార్థులకే అవకాశాలు ఇవ్వాలె.
వాటిని మరింత అభివృద్ధిపరచాలి. తెలంగాణాలోని కాలేజీలు, సాంకేతిక విద్యాలయాల్లో ప్రవేశాలు కేవలు తెలంగాణ విద్యార్థులకు మాత్రమే ఉండాలి.
అది కాని పక్షంలో రాష్ట్రం మొత్తం మీద ప్ర విద్యాలయంలో మూడింట ఒకవంతు (1/3) స్థానాలు తెలంగాణ విద్యార్థులకు అందించాలి.
ఈ రెండిట్లో ఏది తెలంగాణ విద్యార్థులకు మేలు కలుగజేస్తదో ఈ నిర్ణయం తీసుకోవాలి.
4. ఇప్పుడు రాష్ట్రం ఏర్పాటువల్ల ఉద్యోగాలు తొలగించవలసి వస్తే, రెండు ప్రాంతాల్లో జనాభా దామాషా ప్రకారం తొలగించాలి.
5. తదుపరి ఉద్యోగ నియామకాలు రెండు ప్రాంతాల జనాభాను ప్రాతిపదికగా చేసుకుని జరగాలి.
AAP 6. పాలనా న్యాయవ్యవహారాల్లో ప్రస్తుతం తెలంగాణలో అమలులో ఉన్న ఉర్దూను ఇట్లనే ఐదుసంవత్సరాలు కొనసాగించాలి.
రీజనల్ కౌన్సిల్ ఈ అంశాన్ని పునస్సమీక్షించాలె. ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేసుకునేటప్పుడు, తెలుగు భాషాపరిజ్ఞానం తప్పనిసరిగా ఉండాలనే నియమం ఉండరాదు.
అయితే ఉద్యోగంలో చేరిన తరువాత రెండు ఏండ్లలో నిర్దేశిత తెలుగు ప్రావీణ్యతా పరీక్షలో ఉత్తీర్ణులు కావాలి.
7. తెలంగాణావారు తమ జనాభా దామాషాకు అనుగుణంగా ఉద్యోగాలు పొందేందుకు స్థానిక నియమాలు రూపొందాలి. ఉదా: 12 ఏండ్లు ఆవాసం లాంటివి.
8. తెలంగాణ ప్రాంతంలోని వ్యవసాయ భూమి అమ్మకాలు తెలంగాణ రీజనల్ కౌన్సిల్ నియంత్రణలో ఉండాలి.
9. తెలంగాణ ప్రాంత అవసరాలను, ఆవశ్యకతలను దృష్టిలో ఉంచుకొని దాని సర్వతోముఖాభివృద్ధి కోసం, రీజనల్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలి.
10. రీజనల్ కౌన్సిల్లో 20 మంది సభ్యులుండాలె. ఈ శాసన సభ్యులను కింది విధంగా కౌన్సిల్లకు తీసుకోవాలి.
* తొమ్మిదిమంది సభ్యులు తెలంగాణలోని తొమ్మిది జిల్లాలకు ప్రాతినిధ్యం వహించే శాసనసభ్యులు ఉండాలి. వీరిని తెలంగాణ ప్రాంత జిల్లాల శాసనసభ్యులు జిల్లాలవారీగా ఎన్నుకోవాలి.
* ఆరుగురు తెలంగాణ ప్రాంత శాసన సభ్యులు లేక పార్లమెంట్ సభ్యులు. వీరిని తెలంగాణ ప్రాంత శాసన సభ్యులందరూ కలిసి ఎన్నుకోవాలి.
ఐదుగురు సభ్యులు శాసనసభకు బయటివారు ఉండాలె, ఈ ఐదుగురు తెలంగాణ శాసనసభ్యులతో ఎంపిక చేసుకోవాలి. వీరేకాక, తెలంగాణ ప్రాంత మంత్రులందరూ ఈ కౌన్సిల్లో మెంబర్లుగా ఉంటారు.
* ముఖ్యమంత్రి లేదా ఉపముఖ్యమంత్రి ఎవరు తెలంగాణకు చెందిన వారైతే వారు ఈ కౌన్సిల్క అధ్యక్షత వహించాలి. మంత్రిమండలిలోని ఇతర క్యాబినెట్ మంత్రులు ఆహ్వానితులుగా ఉండవచ్చు.
11. రీజనల్ కౌన్సిల్ చట్టబద్ద సంస్థగా ఉండాలె. ఇంతకు ముందు పేర్కొన్న అంశాలపై నిర్ణయాధికారం ఉండాలె.
* ప్రణాళిక అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టులు, ఇతర ప్రాజెక్టుల విషయమై సాధారణ ప్రణాళికలో భాగంగా పారిశ్రామిక అభివృద్ధి, తెలంగాణ ప్రాంతపు ఉద్యోగ నియామకాల విషయంలో నిర్ణయాధికారంకంగా ఉండాలి.
* ఏదైనా అంశంపై రీజనల్ కౌన్సిల్‌కు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య అభిప్రాయ భేదాలుంటే ఆ అంశాన్ని భారత ప్రభుత్వానికి నివేదించాలి. భారత ప్రభుత్వ నిర్ణయమే అంతిమ నిర్ణయం.
12. మంత్రిమండలిలో 60:40 శాతంగా ఆంధ్రప్రాంతీయులు తెలంగాణ ప్రాంతీయులు ఉండాలి. తెలంగాణకు చెందిన 40 శాతంలో కచ్చితంగా తెలంగాణ ప్రాంత ముస్లిం శాసనసభ్యుడు ఉండాలి.
13. ముఖ్యమంత్రి ఆంధ్ర ప్రాంతం నుంచి ఉంటే, ఉప ముఖ్యమంత్రి తెలంగాణ ప్రాంతం నుంచి ఉండాలి.
ముఖ్యమంత్రి పదవిలో తెలంగాణ ప్రాంతీయులు ఉంటే, ఉపముఖ్యమంత్రి పదవిలో ఆంధ్ర ప్రాంతీయులుండాలి. కింది శాఖలలో రెండు శాఖలు తప్పనిసరిగా తెలంగాణ వారికి కేటాయించాలి.
1. హెూమ్
2. ఆర్థిక శాఖ
3. రెవిన్యూ
4. ప్రణాళిక-అభివృద్ధి
5. వాణిజ్యం-పరిశ్రమలు
14. హైదరాబాద్ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు 1962 వరకు ప్రత్యేకప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉండాలని ఆశించిండ్రు. ఆంధ్రప్రాంత ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునికి ఎటువంటి అభ్యంతరం ఉండకూడదు.
* ఈ చర్చలల్లో రెండు అంశాలపై ఏకాభిప్రాయం కుదరలేదు. కొత్తగా ఏర్పడనున్న రాష్ట్రం పేరు ఒక అంశం కాగా, హైకోర్టుకు సంబంధించిన అంశం మరొకటి.
1. తెలంగాణ ప్రాంత ప్రతినిధులు రాష్ట్రానికి ఆంధ్ర తెలంగాణ అని పేరుపెట్టాలి అన్నరు. (ఇది ముసాయిదా బిల్లులో ఉన్నది). ఆంధ్రప్రాంత ప్రతినిధులు జాయింట్ సెలెక్ట్ కమిటీ సూచించిన ఆంధ్రప్రదేశ్ అనే పేరు ఉండాలన్నారు.
2. గుంటూరులో హైకోర్టు బెంచి, హైదరాబాదులో ప్రధానపీఠం ఉండాలని తెలంగాణ ప్రాంత ప్రతినిధులు అన్నరు. గుంటూరులో బెంచి ఉండనవసరం లేదని, హైకోర్టు హైదరాబాదులోనే ఉండాలని ఆంధ్రప్రాంత ప్రతినిధులు అన్నారు.
* 1956 ఫిబ్రవరి 20న చేసిన పై 14 అంశాల ప్రకటనను పెద్దమనుషుల ఒప్పందం అని పేర్కొంటారు.
* ఆ తరువాత కేంద్ర ప్రభుత్వం ‘నోట్ ఆన్ సేఫ్ గార్డ్స్ ప్రపోజ్డ్ ఫర్ ది తెలంగాణ ఏరియా’ అనే పత్రం తయారుచేసి 1956 ఆగస్టు 10న పార్లమెంట్లో ప్రవేశపెట్టింది.
* నిజానికి పెద్ద మనుషుల ఒప్పందంలోని కొన్ని అంశాలు ఇందులో తారుమారు అయ్యాయి.
* పెద్ద మనుషుల ఒప్పందంలో వరుసగా ఉన్న 14 అంశాల బదులు నోట్ ఆన్ సేఫ్ గార్డ్స్ లో ఎ. ప్రాంతీయ కమిటి అని ఆరు అంశాలు, తరువాత బి,సి, డి, ఇ అని మరో నాలుగు అంశాలు చేర్చారు.
* మొత్తంగా చూసిన 10 అంశాలు మాత్రమే ఉన్నాయి. పెద్ద మనుషుల ఒప్పందంకు దాదాపు 10 నుంచి 12 మార్పులు చేసి ఈ నోట్ ఆన్ సేఫ్ గార్డ్స్ లో పొందుపరచారు.
* ఈ నోట్ ఆన్ సేఫ్ గార్డ్స్ ను 1956 ఆగస్టు 10న కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టింది.
నోట్ ఆన్ సేఫ్ గార్డ్స్:
ఎ) ప్రాంతీయ స్టాండింగ్ కమిటీ:
1. ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఒకే శాసనసభ ఉంటుంది. రాష్ట్రానికి చట్టాలు రూపొందించే వ్యవస్థ ఇదే అవుతుంది.
రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉంటాడు. మొత్తం పరిపాలనకు సంబంధించి రాష్ట్ర శాసనసభకు జవాబుదారీగా వ్యవహరించే మంత్రిమండలి గవర్నర్‌కు సహాయకారిగా ఉంటూ సలహాలిస్తుంది.
2. కొన్ని ప్రత్యేక అంశాలకు (స్పెసిఫిక్ మేటర్స్) సంబంధించి ప్రభుత్వ వ్యవహారాల నిర్వహణను మరింత సులభతరం చేసేందుకు తెలంగాణ ప్రదేశాన్ని ఒక ప్రాంతంగా పరిగణిస్తారు.
3. తెలంగాణ ప్రాంతం కోసం రాష్ట్ర శాసనసభకు చెందిన ఒక ప్రాంతీయ స్థాయి సంఘం (రీజనల్ స్టాండింగ్ కమిటీ) ఉంటుంది. దీంట్లో ఆ ప్రాంతానికి చెందిన మంత్రులు, ఆ ప్రాంతానికి చెందిన రాష్ట్ర శాసనసభ సభ్యులు ఉంటారు. ముఖ్యమంత్రికి దీంట్లో స్థానం ఉండదు.
4. ప్రత్యేక అంశాలకు సంబంధించిన చట్టాలను ప్రాంతీయ సంఘం సమాలోచనలకు పంపాలి.
ప్రత్యేకాంశాలకు సంబంధించిన చట్టం చేయడం కోసం ప్రాంతీయ సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేయవచ్చు లేదా ఆర్థిక భారం పడని సాధారణ విధానాలకు సంబంధించి చట్టం చేయడం కోసం ప్రతిపాదనలు చేయవచ్చు.
5. ప్రాంతీయ సంఘం ఇచ్చే సలహాలను రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర శాసన సభ సాధారణంగా ఆమోదించాలి.
ఒకవేళ భిన్నాభిప్రాయాలు వ్యక్తమైతే గవర్నర్ దృష్టికి తీసుకుపోవాలి. గవర్నర్ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉండాలి.
6. ప్రాంతీయసంఘం ఈ కింది విషయాలను పరిశీలిస్తుంది.
* రాష్ట్ర శాసనసభ రూపొందించిన సాధారణ అభివృద్ధి ప్రణాళిక చట్టం పరిధిలో అభివృద్ధి సంస్థలు, జిల్లాబోర్డులు, జిల్లా సంస్థలకు సంక్రమించే రాజ్యాంగబద్ద అధికారాలను పరిశీలిస్తుంది.
* ప్రజారోగ్యం, పారిశుద్ధ్యం, స్థానిక ఆస్పత్రులు, వైద్యశాలలు (డిస్పెన్సరీలు)
* ప్రాథమిక, మాధ్యమిక విద్య
* తెలంగాణ ప్రాంతంలోని విద్యాసంస్థల్లో ప్రవేశాల నియంత్రణ.
* మధ్యపాన నిషేదం – వ్యవసాయ భూముల విక్రయం.
* కుటీర, చిన్నతరహా పరిశ్రమలు, వ్యవసాయం, సహకారసంఘాలు, మార్కెట్లు, సంతలు.
* ఒప్పందాన్ని ముందుగా సవరించని పక్షంలో ఈ ఒప్పందాన్ని పదేండ్ల తర్వాత సమీక్షించాలె.
బి. స్థానిక నియమాలు:
* ‘స్థానిక’ (డొమిసైల్) నియమాలు: సబార్డినేట్ సర్వీసుల భర్తీ విషయంలో తెలంగాణను ఒక యూనిట్‌గా పరిగణనలోకి తీసుకునే విధంగా ఐదేండ్లపాటు తాత్కాలిక ఏర్పాట్లు చేయాలి. ఈ కేదర్లోని పోస్టులను ప్రస్తుత ముల్కీనిబంధనల పరిధిలోకి వచ్చేవారి కోసం రిజర్వు చేయవచ్చు.
సి. ఉర్దూ-దాని స్థానం:
* భారత ప్రభుత్వం ప్రస్తుతం పాలనా, న్యాయవ్యవస్థల గల ఉర్దూ స్థానాన్ని రాబోయే ఐదు సంవత్సరాలపాటు పదిలంగా ఉంచేందుకు వీలుగా రాష్ట్రప్రభుత్వం చర్యలు తీసుకునే విధంగా సూచనలిస్తుంది.
డి. నూతన రాష్ట్రం ఏర్పాటు వల్ల మిగులు ఉద్యోగుల తొలగింపు
* భారత ప్రభుత్వం (హైదరాబాద్ రాష్ట్రంలో) ఎటువంటి తొలగింపు ఉంటుందని భావించడంలేదు.
* హైదరాబాద్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు సహజంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సేవలలోకి పోతారు.
* ఒకవేళ ఉద్యోగులను తొలగించవలసివస్తే ఉమ్మడి రాష్ట్రంలోని ఉద్యోగులకు సమానంగా ఆ తొలగింపు వర్తిస్తుంది.
ఇ. తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల మధ్య వ్యయాల పంపిణీ:
* రాష్ట్ర వనరుల ద్వారా కేటాయించే వ్యయాల అంశం రాష్ట్రప్రభుత్వం, రాష్ట్ర శాసనసభల పరిధిలోనిదే.
* కేంద్రీకృత, సాధారణ పరిపాలన కోసం కొత్త రాష్ట్రం వెచ్చించే వ్యయాన్ని రెండు ప్రాంతాలు ఆయా నిష్పత్తి ప్రకారం భరించాలి.
* ఆదాయంలో మిగులును మాత్రం తెలంగాణ అభివృద్ది నిమిత్తం వెచ్చించే వ్యయం కోసం అట్టిపెట్టాలి.
* బడ్జెట్ కేటాయింపులు చేసేటప్పుడు, ప్రభుత్వం ఒప్పందంలోని షరతుల మేరకు వ్యవహరించాలి.
ఈ అవగాహన గురించి భారత ప్రభుత్వం ఆంధ్ర ముఖ్యమంత్రికి గుర్తు చేయాలి.